Avineni N Bhaskar (@avineni) header
Avineni N Bhaskar (@avineni) profile picture

I Love poetry!

Bengaluru, India
Joined February 2010
"మంజ్ఞుమ్మల్ బాయ్స్ - తాగుబోతు పోరంబోకుల పిచ్చిగంతులు" రచన: జయమోహన్ - తమిళ రచయిత March 9, 2024 (Bhaskar Avineni's FB wall) సాధారణంగా ఇప్పుడొచ్చే సినిమాలను నేను విమర్శించను, నా అభిప్రాయం చెప్పను. ఎందుకంటే నేను కూడా సినిమా రంగం లోనే పని చేస్తున్నాను. వాణిజ్య సినిమాలు తీయడం గొప్ప కళేమీ కాదు. ప్రవచనం కూడా కాదు. కేవలం వ్యాపారం. నూటికి నూరు శాతం వ్యాపారం. కాబట్టి ఒక వ్యాపారస్తుడు మరొకరి వ్యాపారం మీద దాడి చెయ్యకూడదు. అదొక కట్టుబాటు. అయితే ఏనుగు డాక్టర్ కథను రాసిన వాడిగా నేను ఈ వ్యాసం రాయాల్సిన అవసరం ఉంది. మంజ్ఞుమ్మల్ బాయ్స్ అనే మలయాళం సినిమాకు వస్తున్న పొగడ్తలు, చూసిన జనాల పులకింతలు, ఇస్తున్న కితాబులు విని నేను కూడా ఆ సినిమా చూడాల్సి వచ్చింది. ముందుగా, మలయాళం సినిమాలు మనవాళ్ళల్లో కలిగించే భావోద్వేగపు సందోహం గురించి మాట్లాడుకుందాం! ముఖ్యంగా, ‘ది హిందూ - తమిళం’ దినపత్రిక మలయాళ సినిమాల విషయానికొచ్చేటప్పటికి ఇరవైనాలుగు గంటలూ తన్మయత్వంలోనే ఉంటుంది. వారి దృష్టిలో అన్ని మలయాళం సినిమాలూ క్లాసిక్కులే. నిజానికొస్తే వాటిల్లో చాలా సినిమాలు, ఆఖరికి తీసినవాడి సొంత కన్న తల్లిగూడా చూసి భరించలేని కుహనా కళాఖండాలే! మంజ్ఞుమ్మల్ బాయ్స్ సినిమా గనక తమిళంలో వచ్చి ఉంటే ఇక్కడ ఉన్న సాదాసీదా విమర్శకులు కూడా ఒక ప్రశ్న అడిగి ఉండేవాళ్ళు. ‘పత్రికల్లో ప్రచురింపబడిన అంత పెద్ద ప్రమాదకరమైన వార్త, అంత వీరోచితమైన సంఘటన కేరళలోని ఆ మంజ్ఞమ్మల్ ప్రాంత ప్రజలకు మటుకు ఎలా తెలియకుండా పోయింది అని! మంజ్ఞుమ్మల్ బాయ్స్ అసలు ఈ విషయం గురించి ఊర్లో ఏమీ చెప్పనేలేదా? అది ఒకడు మరొకడికోసం ప్రాణం ఇవ్వడానికైనా తెగించిన సంఘటన, దాన్ని అలా ఎలా దాచిపెట్టారు! రోజుల తరబడి కూడా ఈ విషయం బయటకు రాలేదా? ఈ సినిమాలో పతాక సన్నివేశం విపరీత భావోద్వేగాన్ని సృష్టించడం కోసం వండి వార్చబడిన వ్యవహారం. అయితే మలయాళం సినిమాలో వచ్చింది కాబట్టి ఇది మటుకు ‘వాస్తవ చిత్రీకరణ(Realism)’ అంటారు మన ఊరి మహా మేతావులు. అదలా ఉంచితే, అన్ని వాణిజ్య చిత్రాలూ అదీ ఇదీ కల్పించి సృష్టించినవే. కేవలం కాలక్షేపానికి మాత్రమే పనికొచ్చేవి. తమకున్న కొద్ధిపాటి బుర్రతో విషయం మీద లోతైన అవగాహన లేకుండా పొద్దస్తమానం సినిమాల చుట్టూ మాత్రమే తిరుగుతూ వాటినే విశ్లేషిస్తూ తమను తాము మేధావి వర్గానికి చెందిన వాళ్ళం అని భావించే వాళ్ళే ఇక్కడంతా. వాళ్ళ జేబుల్లోంచి వచ్చే డబ్బే నా బాంక్ అకౌంట్ ను కూడా నింపుతుంది, కాబట్టి అలాంటి వాళ్ళ మీద నాక్కూడా కొంచం సానుభూతి ఉంది. గడ్డి ఏపుగా పెరుగుతోంటే సంతోషించేది పశువేగదా! కాకపోతే, మంజ్ఞుమ్మల్ బాయ్స్ నన్ను బాగా చిరాకు పెట్టింది. ఎందుకంటే అది చూపించేది కల్పితం కాదు, వాస్తవం. సినిమా మొత్తం, దక్షిణాదంతా విహార యాత్రలంటూ తిరిగే సగటు కేరళ పోరంబోకుల ముఠాల వైఖరే మనకు చూపిస్తారు. ఇలాంటి వాళ్ళెంతో మంది పర్యాటక స్థలాలలో మాత్రమే కాకుండా, దట్టమైన అడవుల్లో కూడా తిరగడం ఈ రోజున మనం చూస్తున్నాం. ఈ ముఠాలకు పొద్దస్తమానం తాగుడు, వాంతులు చేసుకోవడం, గలాటా చేయడం, పడి నిద్రపోవడం, హద్దులు దాటి ప్రవర్తించటం ఇలాంటివి కాకుండా మరో పనంటూ ఉండదు. ఇలాంటి వాళ్లకు కొంచెం కూడా వ్యవహార జ్ఞానం, బాధ్యతాయుతమైన ప్రవర్తనా ఉండదు. నా మటుకు నేను ఇప్పటివరకు కనీసం ఓ పదిసార్లయినా ఊటి, కొడైకానల్, కుట్రాలం ప్రాంతాల్లో ఈ మలయాళపు తాగుబోతు పోరంబోకులు రోడ్లమీదబడి గలాటాలు చేయడం చూశాను. వాళ్ళు తిరిగే వాహనాలకు రెండు పక్కలా వాళ్ళు తాగి చేసుకున్న వాంతులు, ధారలు ధారలుగా కారుతు ఉంటాయి - ఈ సినిమాలో చూపించినట్టు. తాగేశాక అదే సీసాలను బయటకు విసిరేస్తూ ఉంటారు. మీకు అనుమానం ఉంటే సెంగోటై-కుట్రాలం రోడ్డులోనో, కూడలూరు-ఊటీ రోడ్డులోనో ఒకసారి తిరిగి చూడండి. రోడ్డు పొడవునా ఇరువైపులా పగిలిపోయిన సీసా పెంకులు, పగలని సీసాలుూ పడి ఉంటాయి. దాన్ని కూడా ఈ సినిమాలో అదేదో గొప్ప ఘనకార్యం అన్నట్టు చూపించారు. ఎన్నోసార్లు వీళ్ళతో మేము గొడవకు దిగాము. ఒకసారి వాగమన్‍కు మాతోపాటు వచ్చిన చెన్నై హైకోర్టు లాయర్ సెందిల్‍కుమార్ ఆ పచ్చని నేలమీద వీళ్ళు పడేసి పోయిన సీసాలన్నీ ఓపిగ్గా, జాగ్రత్తగా ఏరి వూర్లో ఉన్న చెత్తకుండీలో పడేయడం నా కళ్ళతో నేను చూశాను. సంవత్సరానికి కనీసం ఇరవై ఏనుగులు ఈ సీసా పెంకులు కాళ్ళల్లో గుచ్చుకుని ఇన్ఫెక్షన్ వచ్చి, ఒళ్ళంతా కుళ్ళి చచ్చిపోతున్నాయి. అదే విషయం మీద ఆగ్రహావేశం ప్రకటిస్తూ రాసిన ఏనుగు డాక్టర్ అనే కథ మలయాళంలో కూడా లక్ష ప్రతులకు పైగా అమ్ముడు పోయింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఆ కథ చదివుండే అవకాశం మృగ్యం. ఈ మలయాళపు పోకిరిగాళ్ళకు పొట్టబొడిస్తే ఇతర భాషల్లో మాట ఒక్కటి కూడా నోట్లో పలకదు. అన్ని ప్రశ్నలకూ మలయాళంలోనే జవాబు చెప్తారు. అంటే నా భాష ఎదుటివాళ్ళకు తెలిసుండాలి అన్న అహంకారం. ఈ సినిమాలో తమిళనాడు పోలీసులు, వాళ్ళతో వ్యవహరించే విధానం కూడా వాస్తవమే. చేతి భాష తప్ప ఇంకేమీ అర్థం కాదు వీళ్ళకి. కేరళలో పెళ్ళిళ్ళకు వెళ్ళడం ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య. మలయాళీల్లో రెండు రకాలుంటారు. విదేశాల్లో రక్తం ధారపోస్తూ ముప్పొద్దులా కష్టపడేవాళ్ళు మొదటి రకం. రెం‍డో రకం - ఈ దేశంలో బతుకుతూ వాళ్ళ సొమ్ము దోచుకుని ఇరవైనాలుగు గంటలూ తాగి తందనాలాడేవాళ్ళు. ఈ తాగుబోతులు ప్రతి పెళ్ళి లోను జొరబడి ఒళ్ళు తెలియకుండా పిచ్చిగంతులు వేస్తూ ఉంటారు. పెళ్ళి వేదిక మీద అక్కడికక్కడే భళ్ళున వాంతులు చేసుకునే వాళ్ళు ఎంతోమంది. ఆఖరికి పెళ్ళికూతుర్ను పక్కనపెట్టుకుని వాంతులు చేసుకున్న పెళ్ళి కొడుకులను కూడా నేను చూశాను. ఈ తాగుడు సంస్కృతిలో తమిళనాడు కూడా మెల్లగా కేరళ స్థాయికి చేరుకో‍డానికి తహతహలాడుతోందని చెప్పి తీరాలి. కేరళకి ఇక్కడికీ తేడా ఏంటని చూస్తే, తాగుడు మైకాన్నీ, తద్వారా జరిగే విధ్వంసాన్నీ అతి సాధారణ వ్యవహారంగా చిత్రీకరించడం కేరళ సమాజానికి అలవాటైపోయింది. పైపెచ్చు పొరపాటున చట్టాన్ని గౌరవించే సామాన్యుడు ఎవరైనా ఉంటే వాణ్ణి దద్దమ్మగాను, పనికిరాని వాడుగాను చిత్రీకరిస్తుంది. కేరళ బీచీల్లో సాయంత్రం ఏడు తర్వాత ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా అడుగుపెట్టలేరు - ఆఖరికి ఈ విషయం గురించి అక్కడి పోలీస్ శాఖ కూడా హెచ్చరిస్తుంది. కేరళ సినిమాల్లో వినోదం అంటే - తాగి గొడవపెట్టుకుని, తగవులాడి, వాంతి చేసుకుని చుట్టూ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి గంతులేయడం మాత్రమే, అన్నట్టు చూపించటం అలవాటైపోయింది. అసలు తాగకుండా సంతోషంగా ఓ నలుగురు మాట్లాడుకుంటూ ఉండే దృశ్యాన్ని ఏ మలయాళం సినిమాలోనైనా మీరు చూడ్టం జరిగిందా? ఈ సినిమా కూడా అలాంటి పనికిమాలిన వెధవల్నే ఆనంద మందారాలుగా చిత్రీకరిస్తుంది. అలాంటి సమర్థింపుని మెల్లమెల్లగా ప్రజల మనస్సులో చొప్పిస్తున్నారు. అంటే ఒక సగటు తమిళ సినిమాలో హీరో ఎలాంటి నికృష్టులనుంచైతే ప్రజలను రక్షించి పుణ్యంగట్టుకుంటాడో అలాంటి వాళ్ళే నేటి మలయాళ సినిమాల్లో గొప్ప హీరోలు! దీనికంతా కారణం - ఎర్ణాకుళాన్ని ఆక్రమించుకున్న ఓ మందుబాబుల ముఠా చుట్టూ మాత్రమే నేటి మలయాళ సినిమా అంతా తిరుగుతోంది. అక్కడ రాత్రీ పగలన్న తేడా లేకుండా మందు ప్రవహిస్తూనే ఉంటుంది. దీనికంటే ఘోరం మాదకద్రవ్యాల వాడకం. కేరళలో, మరీ ముఖ్యంగా ఎర్ణాకుళంలో జరిగేటన్ని మాదకద్రవ్యాల విందులు భారత దేశంలో ఇంక ఎక్కడా జరగవు. మలయాళ కథానాయకులుకూడా తరచూ మాదకద్రవ్యాల కేసుల్లో ఇరుక్కోవడం అన్నది వార్తల్లో మనం చూస్తున్నాం. మత్తు సంస్కృతిలో మునిగిపోవడాన్ని మలయాళ సమాజం అతి సాధారణ విషయంగా పరిగణించేందుకు కృషి చేస్తున్నది నిజానికి వీళ్ళే. పదేళ్ళ క్రితం కేరళలో మత్తును, వ్యభిచారాన్ని అతి మామూలు విషయాలుగా చిత్రీకరించిన ‘కిళి పోయి’, ‘ఒ‌ళివునేరత్తే కళి’, ‘వెడివళిపాడు’, ‘జల్లికట్టు’ వంటి అనేక చిన్న సినిమాలు వచ్చాయి. ఇవన్నీ నాసిరకం, డొల్ల సినిమాలు. అతి మేతావులందరూ వాటిని ‘సహజమైన కళాత్మక సినిమాలు’ అని కొనియాడారు. తమిళనాడులో కూడా అదే స్థాయి మేతావులు కొంతమంది వాటికి బ్రహ్మరథం పట్టారు. ఇదే ధోరణి నేటి సినిమా ప్రపంచమంతా ప్రబలిపోయింది. కేరళ సమాజం మేలు కోరుకునే ఆలోచనంటూ ఉండే ఏ ప్రభుత్వమైనా అంటూ ఉంటే ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళమీద వెంటనే చర్యలు తీసుకోవాలి. వీళ్ళు తీసే మత్తుపిచ్చి సినిమాలను తెగ మెచ్చుకునే తమిళుల్ని ఎవరినైనా సరే, పనికిమాలిన దద్దమ్మలుగా, అయోగ్యులుగా మాత్రమే నేను పరిగణిస్తాను. కమర్షియల్ సినిమా తియ్యడం అనేది ఓ గొప్ప కళేమీ కాదు. అది కళంటూ ఏమాత్రము అవగాహనలేని, బుర్రను ఏమాత్రము కష్టపెట్టడానికి ఇష్టపడని జన బాహుళ్యాన్ని నేరుగా చేరే ప్రయత్నం. దాన్ని అనవసరంగా ఓ కళంటూ నెత్తికెక్కించుకోవటం తగని పని. ఎలాంటి సాలోచనలేని సామాన్య ప్రజల జీవితాలను ఈ విచ్చలవిడితనం నాశనం చేసేస్తుంది. ఈ సినిమాలో చూపించినట్టు ఇలాంటి ముఠాలు హద్దులు దాటి పర్యాటక స్థలాలను విధ్వంసం చేయడమే కాకుండా వన్య సంరక్షణ ప్రాంతాలను కూడా నాశనం చేస్తున్నారు. దానికి అడ్డమైన దారులనూ ఎన్నుకుంటున్నారు. ఏ చట్టాన్నీ లెక్కచేయట్లేదు. ఏ హెచ్చరికనూ పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు - జామకాయ లోపల మిరప్పొడి కూరి కోతులకిస్తున్నారు. ఏనుగుల మీదకు ఖాళీ సీసాలు విసురుతున్నారు. దట్టమైన అడవుల్లో లౌడ్‍స్పీకర్లతో పాటలు పెట్టి పిచ్చి గంతులు వేస్తున్నారు. మే నెల చాలా ప్రమాదకరమైనది. ఈ వెధవలు బీడీ, సిగరెట్లు, ఎండుటాకులతో నిండిన తమిళనాడు అడవుల్లోకి విసిరేసి వెళ్ళిపోతారు. మామూలుగా కేరళ అడవులు ఎండవు. కానీ ఇక్కడ అలా కాదు. వందలాది ఎకరాల అ‍‍‍డవి ఒక్కసారి కాలి బూడిదైపోతుంది. వేలాది జీవులు సమసిపోతాయి. వీళ్ళకసలు ఆ ధ్యాసే ఉండదు. కేరళలోని రిసార్ట్లకు వెళ్లడం అన్నది చాలా ప్రమాదకరం. బయటకు చెప్పుకోలేని ఘోరమైన అనుభవాల గురించి విన్నాను. ఒకసారి నా స్నేహితుడి కూతుర్నీ అల్లుణ్ణీ హనీమూన్ కోసం నేనే ఏర్పాట్లు చేసి పంపించాను. అప్పుడు ఇలాంటి ఒక ముఠా వచ్చి చేసిన అరాచకానికి, వాళ్ళు తప్పించుకుని పారిపోయి తిరిగి రావాల్సి వచ్చింది. నేను సినిమా పనుల మీద మానందవాడిలో ఒక రిసార్ట్ లో ఉన్నప్పుడు, ఒక ఉత్తరాది జంట మీద ఇలాంటి ముఠా దాడి చేసి మానభంగ యత్నం చేసింది. అప్పుడు నేను జోక్యం చేసుకొని తెల్సినవాళ్ళ సహాయంతో వాళ్ళని రక్షించాను - రిసార్ట్లో ఆ రోజు మేనేజర్ కూడా లేడు. మలయాళం రాని ఇద్దరు బెంగాలీ అబ్బాయిలు మాత్రమే ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్నారు. ఇలాంటి చెండాల్లాన్నంతా సామాన్య ప్రజానీకం జరుపుకునే సంబరాలు అన్నట్టు చూపించి సమర్థించడమే కాకుండా, ఈ వెధవలందరికీ పెద్ద పీట వేసి కూర్చోపెడుతోంది, ఈ మంజ్ఞుమ్మల్ బాయ్స్. వాళ్ళను త్యాగమూర్తులుగా, స్నేహశీలులుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఏ దుర్మార్గుల ముఠాకైనా వాళ్ళల్లో వాళ్ళకు ఐకమత్యం ఉంటుంది. ఆఖరికి నేరగాళ్ళ ముఠాల్లో కూడా త్యాగభావం ఉంటుంది. అవేమీ గొప్ప ఆదర్శాలు కావు. ఇలాంటొక వాస్తవ సంఘటన జరిగింది అనీ, వాళ్ళల్లో ఒకడికి జాతీయ స్థాయిలో పురస్కారం వచ్చింది అనీ సినిమా చివర్లో ఒక వార్తను చూపించారు. అసలైతే చట్టప్రకారం జెయిల్లో పెట్టాలి వాడిని. ఈ ముఠాల గురించిన అవగాహనను తమిళనాడులోనూ, కర్ణాటలోనూ ఈ సినిమా సృష్టించగలిగిందంటే మంచిదే. వీళ్ళను పోలీసులు నేరస్తులుగానే భావించాలి. ఏ మాత్రం సహకరించకూడదు. అప్పుడప్పుడూ ఇలాంటివాళ్ళు ఎక్కడైనా ఇరుక్కుని చావడం కూడా ఓ రకంగా మంచిదే. కనీసం మన అడవులు రక్షించబడుతాయి. అదే ప్రకృతి వీళ్ళకిచ్చే నిజమైన శిక్ష. - జయమోహన్ JJeyamohan తమిళ మూలం: jeyamohan.in/197808/
9
49
12
147
33,621